తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, విశాఖపట్టణంలో కీలక నేత అయిన గంటా శ్రీనివాసరావు త్వరలోనే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారనే ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఈనెల 16వ తేదీన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలిసింది. గంటా శ్రీనివాసరావు విశాఖపట్టణంలో సీనియర్ నాయకులు. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో అమలాపురం, గాజువాక నియోజకవర్గాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి పార్టీ స్థాపించిన నాటి నుంచి వెన్నంటి ఉండి అన్నీ తానై నడిపించారు. అంతేకాకుండా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సమయంలో గంటా శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్‌లో చేరిపోయారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా టీడీపీలో చేరారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నారు. గత 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోర పరాభవం చూసినా.. విశాఖ ఉత్తరలో గంటా శ్రీనివాసరావు మాత్రం విజయఢంకా మోగించారు.