91dc8385 0d47 42c9 a876 e84dc7dfdeb1

విమానాలు ఆపలేదు.. తగ్గించాం ..!

జనరల్

విమానాలు ఆపలేదు.. తగ్గించాం :
*విమానాల రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం
*గంటల్లోనే మాటమార్చిన ప్రభుత్వం

బెంగుళూరు, మే 29:రాష్ట్రంలో నిత్యం నమోదవుతున్న వందలాది కరోనా కేసులతో కర్ణాటక ప్రభుత్వం బెంబేలెత్తి పోతోంది. అటు కేంద్రప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురు చూడలేక, ఇటు స్వయంగా నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా స్పష్టత లేని తీర్మానాలతో గందరగోళాన్ని సృష్టించింది. ఈ సమావేశంలోని వివరాలను వెల్లడించిన శాసనసభా వ్యవహారాల మంత్రి తొలుత మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్ మధ్యప్రదేశ్ ల నుంచి విమానాలను 15రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు నుంచి అన్ని రకాల రాకపోకలను కూడా తదుపరి ఆదేశాలు వెల్లడయ్యేంత వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గంటల్లోనే సవరణ :

విమానాల నిషేధం అంశంపై ఇబ్బడి ముబ్బడిగా మాధ్యమాలు కథనాలు ప్రసారం చేయడంతో ప్రభుత్వం గంటల్లోనే మాటమార్చింది. కరోనా కేసుల ఉధృతికి కారణమవుతున్న 5రాష్ట్రాల నుంచి విమానాల సంఖ్యను మాత్రమే తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన వెల్లడించింది. మాధ్యమాలు ప్రభుత్వం చేసిన ప్రకటనను తప్పుగా అర్ధం చేసుకున్నట్లు తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ఏది ఏమైనా రాష్ట్రంలో గత 10రోజుల పాటు నమోదవుతున్న కేసుల్లో పొరుగు రాష్ట్రాల ప్రభావిత కేసులు పెరగడం ప్రభుత్వాన్ని ఆందోళనలో పడేస్తోంది. కానీ వైమానిక వ్యవహారాలపై కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో రాష్ట్రం ఎటూ తేల్చుకోలేక పోతోంది