*వివాదానికి వేదికగా మారిన మంత్రి, సినీ ప్రముఖుల చర్చలు
*చిచ్చు రేపిన బాలయ్య వ్యాఖ్యలు
బెంగళూరు, మే 30:ఓ వైపు కరోనా భయం , లాక్ డౌన్ నిబంధనలతో నిస్తేజంగా మారిన తెలుగు సిని ఇండస్ట్రీ ని నటుడు బాలకృష్ణ(బాలయ్య) వ్యాఖ్యలు వివాదాల సుడిగుండంలో పడేశాయి. లాక్ డౌన్ కారణంగా మూడు నెలల పాటు షూటింగ్ లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు దూరంగా ఉన్న సినిమా పరిశ్రమకు విభాగాల వారీగా అనుమతులు కల్పించాలంటూ తెలుగు రాష్ట్రాల సినీ ప్రముఖులు తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను భేటీ అయ్యారు. చిరంజీవి నేతృత్వంలో ఆయన నివాసంలోనే ఓ సారి, సీఎం కేసీఆర్ తో మరోసారి చర్చించారు. చిరంజీవితో పాటు నటుడు నాగార్జున, దర్శకుల తరపునరాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతల తరపున సురేష్ బాబు, సి.కళ్యాణ్, టీవీ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ ఈ సమావేశాల్లో బాలకృష్ణ కనిపించలేదు. ఈ అంశమే తెలుగు పరిశ్రమలో ఉన్న లుకలుకలను ఎత్తి చూపింది.
నన్నెవరు పిలవలేదే!
ఈ సమావేశాలపై బాలకృష్ణ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘నన్ను ఏ సమావేశానికి పిలవలేదే’ అంటూ మండిపడ్డ బాలకృష్ణ’ వీళ్ళేమైన భూములు పంచుకునేందుకు సమావేశం అవుతున్నారా’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో చిచ్చు రేపాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించేందుకు ప్రయత్నించిన నాగార్జునను కూడా మంత్రి శ్రీనివాస యాదవ్ అడ్డుకునే ప్రయత్నం చేయటం ఆసక్తిగా మారింది.
నోరు జాగ్రత్త: నాగబాబు
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు మండి పడుతున్నారు. చిరంజీవి సోదరుడు నాగబాబు తన వీడియో సందేశం ద్వారా బాలకృష్ణను హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ‘బాలకృష్ణ ఈ సమావేశాలకు కాకపోవడం యాదృచ్చికమే తప్ప ఉద్దేశపూర్వకంగా జరిగింది కాద’న్నారు. చాలామంది ప్రముఖులు ఈ సమావేశాలకు హాజరు కాలేదని ఆయన గుర్తు చేశారు. కానీ భూములు పంచుకునేందుకు హాజరయ్యారని బాలకృష్ణ వ్యాఖ్యానించడం తగదన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేమూ మాట్లాడగలమంటూ హెచ్చరించారు. బాలకృష్ణ అందరిలో ఒక్కడే తప్ప ఆయనేమి ఇండస్ట్రీ కి కింగ్ కాదంటూ విరుచుకుపడ్డారు. ‘మీరు చేసిన వ్యాఖ్యలు సినీ ప్రముఖులనే కాదు తెలంగాణా ప్రభుత్వాన్ని కించపరిచేలా’ ఉన్నాయంటూ ఆరోపించారు. తక్షణమే తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్బంగా నిర్మాత సి.కళ్యాణ్ చేసిన మరో వ్యాఖ్య వివాదంగా మారింది. బాలకృష్ణ ను ‘మా’ అసోసియేషన్ ఆహ్వానించాలి తప్ప మేము కాదన్నారు. దీనితో ‘మా’ అధ్యక్షుడు నరేష్ స్పందిస్తూ ‘మా’ లోని కీలక సభ్యులే హాజరు కాకుంటే బాలకృష్ణ ను ఎలా ఆహ్వానిస్తానని ప్రశ్నించారు. మొత్తంగా ప్రభుత్వంతో సినీ ప్రముఖుల చర్చలు పరిశ్రమలోని లోగుట్టు రాజకీయాలు బయటపెట్టేందుకు వేదికగా, వివాదానికి కేంద్రంగా మారాయి,