పవర్ స్టార్ దారెటు?
*బర్త్ డే రోజున భవిష్యత్ పై స్పష్టత
*రెండు పడవల ప్రయాణం విజయవంతం అయ్యేనా?
బెంగళూరు, ఆగస్టు 17:పవర్ స్టార్ గా విశేషమైన అభిమానుల బలగాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో క్రేజ్ ఉన్న దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గతేడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావాన్ని చూపలేదు. కేవలం ఒక్క ఎమ్మెల్యేతో సరిపెట్టుకున్న జనసేన పార్టీ ప్రజా సమస్యలపై గళం విప్పే స్తోమత కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆ పార్ట్ వ్యవస్థాపకుడు పవన్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే సినిమాల వైపు దృష్టి సారించిన పవన్ ఆ వైపే పూర్తి స్థాయిలో మొగ్గు చూపుతారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
ఆ రోజున మరింత స్పష్టత:
సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఇప్పటికే శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని చేస్తున్న ఆయన ఆ రోజున మరిన్ని సినిమాలపై కీలక ప్రకటనలు చేయనున్నారు
క్రిష్, హరీశ్ శంకర్, డాలీ తదితరుల సినిమాలపై స్పష్టత రానుంది. కానీ రాజకీయాల్లో అడుగు పెట్టిన రోజున ఆయన అంకితభావంపై విమర్శలు వెలువడ్డాయి. జనసేనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చిన లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు పవన్ రెండు పడవల ప్రయాణాన్ని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో దృష్టి సారించినా రాజకీయాల్లో రాణించలేదు. ఈ నేపథ్యంలో సినిమాల కు డేట్లిచ్చి ఉన్నత లక్ష్యాలతో పెట్టిన పార్టీ, నమ్ముకున్న కార్యకర్తలకు ఏ మేరకు న్యాయం చేయగలరన్నది కోటి డాలర్ల ప్రశ్న.