కరోనాకు లొంగని ప్రణబ్ ముఖర్జీ, ఎస్పీబి
*వెంటిలేటర్లపై అలుపెరగని పోరాటం
బెంగళూరు, ఆగస్టు17: ఒకరు రాజకీయాల్లో ఆరితేరిన నేత. ఇంకొకరు సంగీత ప్రపంచంలో మేరు పర్వతం. 84 ఏళ్ల మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 10న దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరెల్ ఆస్పత్రిలో, 74ఏళ్ల గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నయిలోని ఎంజీఎం ఆస్పత్రిలో గతవారం చేరారు. ఇద్దరూ కరోనా పాజిటివ్ తో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ప్రణబ్ ముఖర్జీ మెదడులో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఎస్పీబీకి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం వెంటిలేటర్లపై ఉన్నారు
పోరాటమే వారి శ్వాస:
వీరిద్దరి ఆరోగ్య స్థితి ఒకానొక దశలో వైద్యులకు సవాలు విసిరింది. ప్రణబ్ ముఖర్జీ ఏకంగా తుది శ్వాస విడిచారనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఎప్పటికప్పుడు తండ్రి ఆరోగ్య స్థితిని వెల్లడిస్తూ అనుమానాలను నివృత్తి చేసాడు. ఇక ఎస్పీబీ ఆరోగ్యం పైనా సోషియల్ మీడియా పుకార్లు ప్రచారం చేసింది. కానీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తన తండ్రి చికిత్సకు లొంగుతూ మెరుగవుతున్నట్లు ప్రకటిస్తున్నారు. నేడు వీరిద్దరి ఆరోగ్య సూచీలు ఆశాజనకంగా ఉన్నట్లు ఆయా వైద్యులు ప్రకటించడంతో వారి కోట్లాది అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనాకు లొంగని వీరి పోరాట స్ఫూర్తికి జోహార్లు.