గగనయాన్ నూ విడిచి పెట్టని కొవిడ్:
*75వ స్వాతంత్ర్య పర్వదినాన గగనయాన్ ఎగరక పోవచ్చు!
*లాక్ డౌన్ తో సన్నాహక సమయానికి గండి.
బెంగుళూరు, జూన్ 12:ఇస్రో రూ. పదివేల కోట్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గగన యాన్ నిర్ణీత సమయంలో ఎగిరే అవకాశాలను లాక్ డౌన్ గండి కొట్టింది. ఈ కారణంగా 75వ స్వాతంత్ర దినోత్సవం నాడు మానవసహితంగా గగన యాన్ ప్రయోగించే అవకాశాలు లేనట్లేనని ఇస్రో మూలాల సమాచారం. కొవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు కావటంతో ఇస్రో ప్రాజెక్టులు మందగించాయి. ‘గగన యాన్ ‘ తయారీ ప్రక్రియలు కూడా ఈ నిబంధనలతో నెమ్మదించాయని ఇస్రో సీనియర్ సిబ్బంది ఒకరు వెల్లడించారు.
వ్యోమమిత్ర, మానవరహిత ప్రక్రియలకూ బ్రేక్:
గగనయాన్ ప్రయోగ ప్రక్రియలో భాగంగా ఇదే ఏడాది డిసెంబరు లో హుమానాయిడ్ రోబోట్ ‘వ్యోమ మిత్ర’తో, 2021 జులైలో మానవ రహితంగా గగనయాన్ నూ ప్రయోగించాల్సి ఉంది. ఈ ప్రయోగాత్మక ప్రక్రియల ఆధారంగా 2022 ఆగస్టు 15న 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నలుగురు వ్యోమగాములతో పూర్తి స్థాయిలో గగన్ యాన్ ను ప్రయోగిస్తారు. కానీ మార్చి 24 నుంచి మూడు నెలల పాటు సన్నాహక ప్రక్రియ నిలిచిపోయింది. రష్యాలోని జీసీటీసీలో గగన యాన్ యాత్రికుల శిక్షణ ప్రక్రియ కూడా ఇటీవలే పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ వ్యోమమిత్ర ప్రయోగానికి ఇంకా 6నెలల సమయం ఉండడంతో వాయిదా అంశంపై స్పష్టత ఇవ్వలేక పోతున్నట్లు ఇస్రోకు చెందిన మరో బృందం చెబుతోంది