ఈనెల 25 తర్వాత కర్ణాటకలో కరోనా మరింత విజృంభిస్తుందా? అంటే అవుననే చెబుతున్నాయి కరోనా తాజా గణాంకాలు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపు అయ్యే రోజులు భారీగా తగ్గుతున్నాయి. కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య మే 2 నాటికి 600 చేరింది. ఆపై 16 రోజులకు (మే 18)ఈసంఖ్య రెట్టింపు అంటే 1200కు చేరింది. ఇక రాష్టంలో కేసుల సంఖ్య 1000 నమోదైంది మే 15న అయితే ఆ సంఖ్య రెట్టింపు అంటే 2000కు చేరేందుకు 8రోజులే పట్టింది. మే 23నాటికే కేసుల సంఖ్య 1959కి చేరగా ఇంకో రోజులో 2వేల మార్కు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
25తర్వాత మరింత వేగం:
మే 25 నుంచి దేశీయ విమానాలు సంచరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. రైళ్లు, బస్సుల్లో వస్తుంటేనే కేసుల తీవ్రత ఈ స్థాయిలో ఉంటే ఇక విమానాల సంచారం మొదలైతే తక్కువ రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదు కాగలవు. వ్యాపారవేత్తలు, గర్భిణులు, 10ఏళ్ళ లోపు 80ఏళ్ళ పైబడిన వారికి క్వారంటైన్ నిబంధనల్లో మినహాయింపులు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవకాశమే వీఐపీ సంస్కృతి మరోసారి జడలు విప్పి కరోనా వ్యాప్తిని పెంచి పోషించగలదు.