రాజ్యసభకు రాష్ట్ర పెద్దలు
*ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురు అభ్యర్థులు
*దేవెగౌడ తప్ప అందరూ తొలిసారిగా రాజ్యసభకు
బెంగుళూరు, జూన్ 12:కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న నలుగురి ఎన్నిక అందరూ ఉహిస్తున్నట్లుగానే ఏకగ్రీవంగానే ముగిసింది. శుక్రవారం వీరి ఎన్నిక ఏకపక్షంగా జరిగినట్లు విధానసభ కార్యదర్శి విశాలాక్షి ప్రకటించారు. మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ (జే డీ ఎస్ )రెండవసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఉండగానే దేశ ప్రధానిగా సేవలందించిన విషయం తెలిసిందే. ఇక గత పార్లమెంట్ లో కాంగ్రెస్ కు లోకసభ నాయకుడిగా భాద్యతలు చేపట్టిన మాజీ కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే(కాంగ్రెస్), ఈరన్న కడాడి, అశోక్ గస్తీలు(బీజేపీ)తొలి సారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ కనీసం ఎమ్మెల్యేలుగా కూడా గెలవక పోవడం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్ సహకారంతో: అధికార పక్షం బీజేపీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ల సహకారంతోనే ఈ నలుగురు అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవంగా మారింది. బీజేపీకి ఇద్దరు అభ్యర్థులకు మించి, కాంగ్రెస్ కు ఒక అభ్యర్ధికి మించి అదనపు సంఖ్యాబలం ఉన్నా మరో అభ్యర్థిని బరిలో దించలేదు. ఈ పార్టీల నిర్ణయాలు కేవలం 34 స్థానాలే ఉన్న జేడీఎస్ అభ్యర్థి దేవెగౌడ గెలుపునకు బాటలు వేశాయి. మరో వైపు ఎన్నికల అవసరం కూడా లేకుండా చేశాయి. దీనితో ఈ నెల 19న నిర్వహించాల్సిన ఎన్నికలు రద్దయి నలుగురి అభ్యర్థుల గెలుపు ఏకగ్రీవం చేశాయి. కానీ బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానాలు తమ సర్వాధికార నిర్ణయాలతో అభ్యర్థులను ఎంపిక చేయటం రాష్ట్ర నేతలను ఉలిక్కి పడేలా చేస్తే. రాష్ట్ర పెద్దలను(దేవెగౌడ, ఖర్గే) రాజ్యసభకు పంపేలా చేశాయి.