మంత్రి వర్గం.. గందరగోళం
*మంత్రివర్గ సభ్యుల్లో ఏకాభిప్రాయ లోపం
*మొన్న విమానాల రద్దు.. నిన్న ఆన్ లైన్ తరగతుల పై శాసన సభ మంత్రి విభిన్న ప్రకటనలు
బెంగుళూరు, జూన్ 12: కర్ణాటక మంత్రి వర్గం ఏకాభిప్రాయ లోపంతో కొట్టుమిట్టాడుతోంది. ఆపరేషన్ కమలతో పార్టీలోకి వచ్చిన వలసలు, పార్టీ విధేయుల మధ్య సమన్వయ లోపంతో ప్రతి మంత్రివర్గ సమావేశం గందరగోళంగా మారుతోంది. పాలన సంబంధమైన కీలక నిర్ణయాల్లోనూ ఏకాభిప్రాయం కుదరని స్థితి.
నిధులు.. నిర్ణయాలు:
ప్రస్తుత మంత్రివర్గంలో 11మంది వలస సభ్యులు. కీలకమైన శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. వీరంతా తమ శాఖలతో పాటు తమ నియోజక అభివృద్ధి కోసం భారీగా నిధులు రాబడుతున్నారు. ఇదే వ్యవహారం పార్టీ సొంతవాళ్లకు మింగుడు పడటం లేదు. పైగా ప్రస్తుత కొవిడ్ నియంత్రణలో వలస మంత్రులదే హవా. వైద్య విద్యా మంత్రి సుధాకర్, కార్మిక మంత్రి శివరాం హెబ్బార్, వ్యవసాయ మంత్రి బీసీ పాటిల్ తదితరులే మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నారు. ఇది కూడా పాతవారిని తొలచివేస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేని స్థితి. మంత్రివర్గ సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేసినా ప్రతి నిర్ణయం పై వలస, పాత వారి మధ్య ఏకాభిప్రాయం కుదరని స్థితి. కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా తొలుత 5 రాష్ట్రాల నుంచి విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఆపై మతమార్చడం, తాజాగా 7వ తరగతి వరకు ఆన్ లైన్ క్లాసులు రద్దు అని శాసనసభ వ్యవహారాల మంత్రి మాధుస్వామి ప్రకటించటం ఆపై విద్యామంత్రి ఖండించడం మంత్రివర్గంలో భిన్నాభిప్రాయాలను బహిరంగపరుస్తున్నాయి