బెంగళూరు: కరోనా రక్కసి కర్ణాటకలో కోరలు చాస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఫలితంగా మార్చి 8 (కర్ణాటకలో తొలి కేసు) నుంచి ఆగస్టు 13వ తేదీ నాటికి రెండు లక్షలు దాటింంది. దశల వారీగా చూస్తే లాక్‌డౌన్ విధించిన సమయంలో నియంత్రణలో ఉన్నా.. అన్‌లాక్ కొంప ముంచినట్లు తెలుస్తోంది. జూలై 16వ తేదీ నాటికి అర లక్ష కేసులు దాటగా.. 27వ తేదీ నాటికి లక్ష మందికి సంక్రమించింది. అదేవిధంగా ఆగస్టు 5వ తేదీ 1.5 లక్షల మార్కు దాటుకుని 13వ తేదీకి రెండు లక్షలు దాటేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,21,242 మంది డిశ్చార్జి అయ్యారు. అదేవిధంగా 78,337 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం పాజిటివ్ కేసుల్లో కర్ణాటక నాల్గో స్థానానికి చేరింది. కర్ణాటక కంటే మహరాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందు ఉన్నాయి. కర్ణాటకలో ఇప్పటి వరకు 18,82,316 మందికి పరీక్షలు చేశారు.
చేరుకున్నాయి ఇలా..
మార్చి 8న – తొలి పాజిటివ్ కేసు
మార్చి నెలాఖరు – 101 కేసులు, ముగ్గురు మృతి
ఏప్రిల్ చివరికి – 565 కేసులు, 21 మంది బలి
మే ఆఖరికి – 3221 కేసులు, 51 మరణాలు
జూన్ 30 నాటికి – 15242కేసులు, 246 మృతులు
జూలై 16వ తేదీ – 51,422 పాజిటివ్‌లు, 1032 మరణాలు
జూలై 27 నాటికి – 1,01,465 కేసులు, 1953 మరణాలు
ఆగస్టు 5వ తేదీ – 1,51,449 కేసులు, 2804 మంది మృతి
ఆగస్టు 13వ తేదీ – 2,03,200 పాజిటివ్‌లు, 3613 మరణాలు