కొంప ముంచిన అన్ లాక్
*కళ్లెం లేని కరోనా
*20 రోజుల్లో 6వేలకు పైగా కరోనా కేసులు
*బెంగుళూరులో అంతు చిక్కని కరోనా వాహకులు
బెంగుళూరు, జూన్ 21:రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా బలోపేతమయ్యేందుకు లాక్ డౌన్ కు నీళ్లొదిలి పూర్తి స్థాయి అన్ లాక్ వైపు దృష్టి సారిస్తోంది. ఇదే అదునుగా కరోనా విజృంభిస్తోంది. మే 31న కేంద్రం లాక్ డౌన్ పై నిబంధనలు సడలించింది. అంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం అన్ లాక్ విధానాలను అనుసరించేందుకు కసరత్తు ప్రారంభించింది. సినిమా థియేటర్లు, ఈత కొలనులు మినహా ఆర్ధిక కార్యకలాపాలన్నీ ప్రారంభం అయ్యాయి. ఆ సమయంలో రాష్ట్రంలో కరోనా కేసులు నియంత్రణలోనే ఉన్నాయి.కానీ ఆ తర్వాతనే పరిస్థితి తారుమారు అయ్యింది.
20రోజుల్లో ఆరు వేలకు పైగా:
మే 31 నాటికి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2, 700మాత్రమే. కానీ జూన్ 21నాటికి ఆ కేసుల సంఖ్య 9, 150కి చేరింది. అంటే గడచిన 20 రోజుల్లో ఆరువేలకు పైగా కేసులు నమోదయ్యాయి
ఈ 20రోజుల్లో కరోనా మరణాలు కూడా వందల సంఖ్యలో పెరిగి 137కు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో కేసులు నమోదవుతాయని ఊహించి ఉండదేమో.
కేసుల రేసులో బెంగుళూరు నంబర్ వన్:
మే 31 నాటికి కరోనా పేరు చెబితే బెంగళూరు మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ ఉన్నపళంగా ఉడుపి, కలబురగి, యాదగిరి జిల్లాలు దూసుకు వచ్చాయి. ఎంతలా అంటే బెంగుళూరు కంటే వేగంగా వెయ్యి కేసులు ఉడుపి, కలబురగిలో నమోదయ్యాయి. కానీ ఆదివారానికి బెంగుళూరు కేసుల రేసులో మరింత వేగాన్ని అందుకుని మళ్ళీ రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచింది. ఆదివారం ఏకంగా 196 కేసులు ఒక్క బెంగళూరులో నమోదు కావటంతో నగర ప్రజలు భీతిల్లి పోతున్నారు. మరణాల విషయంలో బెంగుళూరు నగరం ఆందోళనకరంగా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారానికి 137 కరోనా మరణాలు నమోదు కాగా 64 కేసులు బెంగుళూరు లోనే సంభవించటం గమనార్హం. పైగా కరోనా లక్షణాలు లేని వారు, శ్వాస సంబంధ, ఐ ఎల్ ఐ లక్షణాలున్న వారి సంఖ్య నగరంలో పెరుగుతుండటం ఆరోగ్య శాఖకు సవాళ్లు విసిరే అంశం. ఏ నేపథ్యం లేనివారు కరోనా వాహకులుగా మారి సమూహ వ్యాప్తికి సంకేతంగా నిలుస్తున్నారు. ఓ వైపు కర్ణాటక ప్రభుత్వం కరోనా కట్టడిలో చేపడుతున్న చర్యలు ఇతర రాష్ట్రాలు అనుసంచేవిగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కితాబిచ్చింది. కానీ తాజా పరిస్థితి ఆందోళనను రెట్టింపు చేస్తోంది.