బెంగళూరు: సిలికాన్ సిటీ బెంగళూరులోని డీజే హళ్లి – కేజీ హళ్లి ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన అల్లర్లకు సంబంధించి మొత్తం ఐదుగురిపై 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అల్లర్లలో ముగ్గురు మృతి చెందగా.. సుమారు 200 వాహనాలు కాలిపోయిన సంగతి తెలిసిందే. ‘పోలీసులను చంపేయండి’ అని ఆయుధాలతో నిరసనకారులు నినాదాలు చేశారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఐదుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి 8.45 గంటల సమయంలో డీజే హళ్లి ప్రాంతంలో దాడులు ప్రారంభించారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి నివాసం బయట దాడులకు పాల్పడ్డారు. ఈ నిరసనలకు ప్రధాన కారణం ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి బంధువు అయిన నవీన్ ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దాంతో అల్లర్లు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసుకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 143, 147, 307, 436, 353, 332, 333, 427, 504, 506, 149, 34 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం సాయంత్రం వెల్లడించారు.
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలు
– మంగళవారం రాత్రి 8:45 గంటలకు, ఐదుగురు వ్యక్తులు అర్ఫాన్, ఎస్‌డీపీఐకి చెందిన ముజ్జామిల్ పాషా, సయ్యద్ మసూద్, అయాజ్, అల్లాహ్ బ„Š తో పాటు 300 మంది వీధుల్లోకి వచ్చారు. వాళ్ల చేతుల్లో కొడవళ్లు, రాడ్లు వంటి ఆయుధాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు.
– వారందరు ‘పోలీసులను చంపండి, వారిని విడిచిపెట్టవద్దు’ అని నినాదాలు చేశారు. పోలీసులపై ఇటుకలు విసిరారు. దాడిలో స్టేషన్‌లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ తలకు గాయమైంది.
– పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా ఈ గుంపు అక్కడ నుంచి కదల్లేదు, విధ్వంసం కొనసాగింది. వారు కేజీ హళ్లి, డీజే హళ్లి పోలీస్ స్టేషన్లలోని వాహనాలకు నిప్పు పెట్టారు.
– జనసమూహాన్ని అక్కడి నంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. కానీ నిరసనకారులు పోలీసులను ఉద్దేశించి ‘మిమ్మల్ని అంతం చేయకుండా ఇక్కడ నుంచి కదలం’ అని నినదించారు. వారు బేస్‌మెంట్ నుంచి పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి, ‘హత్య చేయాలనే ఉద్దేశంతో’ పోలీసు సిబ్బందిపై తిరగబడ్డారు.
– ఎఫ్‌ఐఆర్‌లో, మూక దాడిలో చిక్కుకున్న పోలీసుల ప్రాణాలను కాపాడటానికి తాము గాలిలో ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా అర్ఫాన్, ముజ్జామిల్ పాషా (ఎస్‌డీపీఐ), సయ్యద్ మసూద్, అయాజ్, అల్లాహ్ బ„Š కేఎస్‌ఆర్‌పీ ప్లాటూన్ల నుంచి తుపాకులను లాక్కోవడానికి ప్రయత్నించారు. దాంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. వారిని అరెస్ట్ చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
– దాడిలో మొత్తం 60 మంది పోలీసులు గాయపడ్డారు. దుండగులు పోలీస్ స్టేషన్ వెలుపల ఆపి ఉంచిన వాహనాలను తగలబెట్టడం ప్రారంభించగానే, ఒక పోలీసు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దాంతో నిరసనకారులు పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి తలుపులు, కిటికీలు పగలగొట్టారు.