download

యాభై శాతం కుటుంబాలపై కరోనా ప్రభావం

NATIONAL జనరల్

‘కరోనా’ మహమ్మారి దేశంలోని దాదాపు యాభై శాతం కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు ఓ ప్రైవేటు సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో కొందరు ఊహించని విధంగా ఉపాధి పోగొట్టుకున్నారు. చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్నవారే. అకస్మాత్తుగా జీవనాధారం కోల్పోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో లక్షలాది మంది వలస కార్మికులు కాలినడకనే ఇళ్లబాట పట్టారు. పగిలిన పాదాలు నెత్తురోడుతున్నా, ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో వందల కిలోమీటర్లు నడిచారు.

వ్యాపారుల విలవిల
చిన్నా చితకా వ్యాపారుల పరిస్థితి కూడా దారుణంగా మారింది. చాలామంది గిరాకీ లేక దుకాణాలు మూసేసుకున్నారు. ‘కరోనా’ దెబ్బకు మూతబడిన వ్యాపారాల్లో చిన్న చిన్న టీస్టాల్స్‌ మొదలుకొని, పెద్ద పెద్ద రెస్టారెంట్లు, చిత్రమందిరాలు కూడా ఉన్నాయి. కొన్ని దుకాణాలను తెరిచినా వ్యాపారం లేక వెలవెలబోతున్నాయి. ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిలోనూ చాలామందికి జీతాల్లో కోతలు పడుతుండటంతో ప్రజల్లో కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గింది.

కోలుకోని రవాణా వ్యవస్థ
రవాణా వ్యవస్థ ఇప్పటికీ తేరుకోలేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని రవాణా సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. మరో ఆరునెలల వరకు ఉన్నచోటును విడిచి ప్రయాణాలకు బయలుదేరేది లేదని చాలామంది తెగేసి చెబుతున్నారు. కోరుకుంటే విదేశాలకు విమానాల్లో వెళ్లగలిగే స్థోమత ఉన్న సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాల వారిలో దాదాపు 35 శాతం మంది మరో ఆరునెలల వరకు విమాన ప్రయాణాల జోలికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. మెరుగైన ఆదాయం గల సంపన్నుల పరిస్థితే ఇలా ఉంటే, ‘కరోనా’ ధాటికి సామాన్యుల బతుకులు ఇంకెంతలా చితికిపోయాయో ఊహించుకోవాల్సిందే.