– బాధితులకు నష్టపరిహారంగా ఇవ్వండి
– డీజే హళ్లి – కేజీ హళ్లి ఘటనపై సీఎం బీఎస్‌వై
బెంగళూరు: రాజధాని నగరంలోని డీజే హళ్లి – కేజీ హళ్లిలో ఈనెల 11వ తేదీ రాత్రి జరిగిన హింసాత్మక ఘటనపై ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నేతృత్వంలో సోమవారం ఉదయం కావేరి నివాసంలో పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం యడియూరప్ప మాట్లాడుతూ ఘటనలో పాల్గొన్న వారి వివరాలు సేకరించి.. వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఆస్తిని బాధితులకు నష్ట పరిహారంగా చెల్లించాలని సూచించారు. అల్లర్లలో భాగంగా వందల సంఖ్యలో వాహనాలకు నిప్పు పెట్టారు. రెండు పోలీస్ స్టేషన్‌లలోని వాహనాలతో పాటు రోడ్డు పై ఉన్న వాటిని కూడా దహనం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నష్ట పరిహారాన్ని ందితుల నుంచి రప్పించుకోవాలని సీఎం యడియూరప్ప చెప్పారు అదేవిధంగా పట్టుబడ్డ వారిపై విచారణ అనంతరం గూండాచట్టంతో పాటు చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం నమోదు చేయాలని తీర్మానించారు.
ఉత్తరప్రదేశ్ తరహాలో..
ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో అక్కడి యోగిఆదిత్యనాథసింగ్ ప్రభుత్వం.. సామాన్యుల ఆస్తిపాస్తులు నష్టం చేసిన గూండాల నుంచి ఆస్తులు స్వాధీనం చేసుకుని పంచిపెట్టాలని తీర్మానించిన విషయాన్ని ప్రస్తావించారు. అదే తరహాలో కర్ణాటక ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుందని సీఎం యడియూరప్ప చెప్పారు. డీజే హళ్లి – కేజీ హళ్లి ఘటనలో పాల్గొన్న అందరి ఆస్తులను స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని.. సామాన్యులకు జరిగిన నష్టాన్ని నిందితుల చేతనే భర్తీ చేస్తామని తెలిపారు. న్యాయ నిపుణుల సలహా మేరకు ఆస్తి స్వాధీనం చేసుకోవడం కుదరకపోతే.. జప్తు చేసుకోవాలని సూచించారు. విచారణ నేపథ్యంలో ముగ్గురిని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లుగా నియమించాలని ఆదేశించారు.
అడ్వకేట్ జనరల్ సలహా మేరకు..
సమావేశంలో హోంమంత్రి బసవరాజు బొమ్మై, డీజీపీ ప్రవీణ్ సూద్, బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్‌పంత్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీఎం విజయభాస్కర్, అదనపు కార్యదర్శి రజనీశ్ గోయల్, సీసీబీ జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్, నిఘా విభాగం ఉన్నతాధికారి బి.దయానంద, అడ్వకేట్ జనరల్ ప్రభులింగా తదితరులు పాల్గొన్నారు. సుమారు గంట పాటు జరిగిన సమావేశంలో భాగంగా ఆస్తులు స్వాధీనం చేసుకునే విషయమై న్యాయ సలహాలను అడ్వకేట్ జనరల్ ప్రభులింగా ద్వారా పొందారు. ఆస్తికి నష్టం కలిగించిన వారి నుంచి వసూలు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానం పాటిస్తోంది.