తెలంగాణలో ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్న దుబ్బాక ఉప ఎన్నికపై ఇప్పుడు అంతర చర్చ జరుగుతుంది. అన్ని పార్టీలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని పార్టీకి సూచనలు ఇచ్చారట.. అయితే ఇక్కడ ఈజీ గా గెలుస్తామని అధికార టీఆర్‌ఎస్ పార్టీ బలంగా నమ్ముతోంది. కానీ కాంగ్రెస్ , బీజేపీలు సైతం ఇక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంతో రసవత్తర రాజకీయం తప్పదని తెలుస్తుంది..
కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధమేనని ప్రకటించారు. అదే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దుబ్బాక లో బీజేపీ బరిలో ఉటుందని స్పష్టం చేశారు. ఫలితంగా మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మరో సారి హోరాహోరీ పోటీ ఉండబోతోంది. ఇటీవల అనారోగ్యంతో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి (టీఆర్‌ఎస్) మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇంకా నోటిఫికేషన్ రాలేదు.
రామలింగారెడ్డి కుటుంబానికే టికెట్
అధికార టీఆర్‌ఎస్ తరపున రామలింగారెడ్డి కుటుంబ సభ్యులు బరిలో దిగుతారని సమాచారం. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి రామలింగారెడ్డి ఎన్నో సేవలు చేయగా తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసినా కృషి మరువలేనిది. దీంతో ఆ కుటుంబానికి కాకుండా ఎవరికీ సీటు ఇచ్చే ఆలోచనలో పార్టీ అధిష్టానం కూడా లేదు. ఆయన భార్య లేదా కుమారుడిని ఉప ఎన్నికల బరిలో దింపేందుకు టీఆర్‌ఎస్ సిద్దమైంది.