Gold and Cash

అనంతపురంలో బయటపడ్డ అవినీతి ఖజానా

జనరల్

రాయలసీమలోని అనంతపురం జిల్లాలో సంచలన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఊహకందని విధంగా ట్రెజరీ ఉద్యోగి కారు డ్రైవర్‌ బంధువు ఇంట్లో భారీఎత్తున అవినీతి బయటపడింది. అచ్చం సినిమాను తలపించే విధంగా మారుమూల ప్రాంతంలోని ఓ చిన్న ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో పని చేసే ఓ సీనియర్‌ అకౌంటెంట్‌కు చెందిన అవినీతి సంపాదన అని తేలింది. ఇందులో ఓ ఎయిర్‌ పిస్టోల్‌ కూడా లభ్యమైంది.

వివరాలు.. అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో మనోజ్‌కుమార్‌ అనే వ్యక్తి సీనియర్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతడు బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన నాగలింగను కారు డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. ఇటీవల సీసీఎస్‌ పోలీసులకు మనోజ్‌కుమార్, నాగలింగపై ఫిర్యాదు రావడంతో కొన్ని రోజులుగా వారిద్దరి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈనేపథ్యంలో మంగళవారం సీసీఎస్‌ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో డ్రైవర్‌ నాగలింగను అదుపులోకి తీసుకున్నారు. నాగలింగ ఇచ్చిన సమాచారంతో అతడి మామ బాలప్ప ఇంట్లో తనిఖీ చేయగా 8 ట్రంకు పెట్టెలు లభ్యమయ్యాయి. వాటిని తెరచి చూడగా కిలోల కొద్దీ బంగారం, వెండి, భారీ మొత్తంలో నగదు వెలుగు చూశాయి.