file 0000000040208211be72e5d1dd50841a 200kb 1

Pavagada: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి…!

జనరల్

 

పావగడ–తుమకూరు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి!

కనివేనహళ్లి గేట్ సమీపంలో కారు–ద్విచక్ర వాహనం ఢీ.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

పావగడ: పావగడ–తుమకూరు రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాలూకాలోని కనివేనహళ్లి గేట్ సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని మడకశిర తాలూకా గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ (45), మేఘేష్ (22), కొండపల్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి (35)గా గుర్తించారు.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహాలింగప్ప (28), తిప్పేస్వామి (25), మహాలింగప్ప (27) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం తుమకూరులోని ఆసుపత్రికి తరలించారు.

మృతులు పావగడ తాలూకాలోని పోతగానహళ్లిలో భవన నిర్మాణ పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై తమ స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, తుమకూరు వైపు నుంచి వస్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పావగడ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ప్రమాదాలకు నిలయంగా కనివేనహళ్లి గేట్!

కనివేనహళ్లి గేట్ సమీపంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో అవసరమైన రోడ్డు భద్రతా చర్యలు చేపట్టి, భవిష్యత్తులో మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *