images 4

టీటీడీ ఆస్తుల విక్రయానికి బ్రేక్…!

జనరల్

టీటీడీ ఆస్తుల విక్రయానికి బ్రేక్:
దేవస్థానం నిరర్ధక ఆస్తుల విక్రయానికి బ్రేక్ వేసిన ఏపీ ప్రభుత్వం భక్తుల మనోభావాల దృష్ట్యా ఈ నిర్ణయం పై పునః పరిశీలనకు ఆదేశం

బెంగళూరు, మే 26:వివాదంగా మారిన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్తుల విక్రయ నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రేకులు వేసింది. తమిళనాడులోని మారుమూల గ్రామాల్లోని దాదాపు రూ.23కోట్ల విలువైన 23ఆస్తులను వేలం వేయాలన్న ప్రతిపాదన టీటీడీ పాలకమండలి నుంచి వచ్చింది. కానీ ఈ ప్రక్రియ ఎప్పుడని మాత్రం ప్రకటించలేదు. ఈ మధ్యలోనే ప్రతిపక్షాలు, ధార్మిక సంఘాలు, భక్త బృందాల నుంచి పెద్ద ఎత్తున ఆక్షేపణ వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలని సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
పునః పరిశీలనకు ఆదేశం:
వాస్తవానికి టీటీడీ ఆస్తులను విక్రయించే ప్రక్రియ కొత్తదేమీ కాదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 2016 జనవరి 30న టీటీడీకి చెందిన 50ఆస్తులను విక్రయించేందుకు అప్పటి పాలకమండలి తీర్మానించింది. ఆ మండలిలో ప్రస్తుత నిర్ణయంపై రాద్ధాంతం చేస్తున్న బీజేపీ, టీటీడీ తరుపున సభ్యులున్నారు. నలుగేళ్లనాటి ఆ తీర్మానాన్ని కొనసాగించేందుకు ప్రస్తుత పాలకమండలి సిద్ధమైంది. కానీ భక్తుల మనోభావావాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆస్తుల అమ్మకాల కంటే ఆ స్థలాల్లో శ్రీవారి పేరిట దేవాలయాలు, అన్నదాన సత్రాలు, కళ్యాణమంటపాలు నిర్మించాలని మతపెద్దలు ఇచ్చిన సలహాలాను పరిశీలించాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. సోమవారం టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డితో చర్చించిన ముఖ్యమంత్రి ఈ విషయంపై త్వరలో సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు.
దేవాలయాల జోలికి వస్తే ఊరుకోం
హిందూ దేవాలయాలు, వాటి ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. పార్టీ నేతలతో ఆయన గుంటూరులో నిరాహారదీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అండతో దేవాలయాల ఆవరణల్లో మతమార్పిడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ తీర్మానం రోజే బహిరంగ ప్రకటన చేయలేని పాలకమండలి దొంగచాటుగా టీటీడీ ఆస్తులను కొట్టేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం అండతోనే ఆస్తుల విక్రయ ప్రణాళిక సిద్ధమైనట్లు మండిపడ్డారు. ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి..ఆస్తులు విక్రయించాలంటే మారుమూల గ్రామాలపై దృష్టి సారించాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ హయాంలో ఎన్నో టీటీడీ ఆస్తులను విక్రయించకుండా అడ్డుకున్నామని గుర్తుచేశారు. అప్పట్లో భూములు విక్రయించేందుకు సిద్దమైన ప్రస్తుత ప్రతిపక్షాలు ఇదే అంశంపై ఆందోళన చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు