గగన్ యాన్ వ్యోమగాములకు మళ్ళీ ప్రారంభమైన శిక్షణ:-50రోజుల లాక్ డౌన్ విరామం తర్వాత శిక్షణ ప్రారంభం. -రష్యాలోని జీసీటీసీలో ఏడాది పాటు శిక్షణ పొందనున్న నలుగురు ఇస్రో వ్యోమగాములు, భౌతిక దూరం పాటిస్తూనే శిక్షణ.
బెంగుళూరు, మే 24:భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవ సహిత ఉపగ్రహం గగన్ యాన్ లో పయనించే వ్యోమగాములకు శిక్షణ మళ్ళీ ప్రారంభం అయ్యింది. రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కోస్మస్ ఆధ్వరంలో గాగారిన్ రీసెర్చ్ టెస్ట్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్(జీసీటీసీ)లో ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఈ ట్రైనింగ్ కరోనా కారణంగా నిలిపి వేశారు. మార్చి 30న నిలిపివేసిన ఈ శిక్షణ మే 23 నుంచి మళ్ళీ ప్రారంభమైంది. ఏడాది పాటు కొనసాగే ఈ శిక్షణలో ఇంకా అవగాహన తరగతులే మొదలైయ్యాయి. కరోనా ప్రభావం ఇంకా తొలగకపోవడంతో మరో వారం పాటు ప్రయోగాత్మక తరగతులు ప్రారంభించామని రోస్కోస్మస్ ప్రకటించింది. మానవ సహిత ఉపగ్రహంపై అవగాహనతో పాటు రష్యన్ భాష పైనా భారతీయ వ్యోమగాములు పట్టు సాధించనున్నారు. ఈ శిక్షణ తర్వాత ఇస్రో రూపొందించిన ప్రత్యేక మార్గదర్శకాలు కూడా వీరికి అందిస్తారు.
భౌతిక దూరంతోనే:
భౌతిక దూరం, మాస్కులు, చేతి తొడుగులు ధరిస్తూనే శిక్షణ కొనసాగిస్తారు. ఈ శిక్షణ కేంద్ర సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు వహిస్తారు. అపరిచితులను శిక్షణ కేంద్రంలోకి అనుమతించబోమని రోస్కోస్మస్ ప్రకటనలో పేర్కొంది. శిక్షణ పొందుతున్న భారత వ్యోమగాముల చిత్రాలను కూడా విడుదల చేసింది.
ఇస్రో 75వ ఏట ప్రయోగం:
రూ. 10వేల కోట్ల వ్యయంతో రూపొందే గగన్ యాన్ ప్రాజెక్ట్ ఇస్రో 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 2020లో అంతరిక్షంలో అడుగు పెట్టనుంది. ఈ ఉపగ్రహంలో నలుగురు వ్యోమగాములు వెళ్లనుండగా వీరంతా భారతీయ వైమానిక పైలెట్లే కావటం గమనార్హం. రష్యాలో ప్రస్తుతం వీరికి ఇస్తున్న శిక్షణ కోసం ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, గ్లవ్కోసమోస్ ల మధ్య 2019 జూన్ 27న ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే