ఎమ్మెల్సీ అభ్యర్థులంతా సిద్ధం
*బీజేపీ 4, కాంగ్రెస్ 2, జేడీఎస్ 1 అభ్యర్థులకు బెర్తులు
*అందరి ఎన్నిక ఏకగ్రీవం!
బెంగుళూరు, జూన్ 18:కర్ణాటక విధాన పరిషత్తు లో ఖాళీ అవనున్న 7స్థానాలకు ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఆయా పార్టీల సంఖ్యా బలం బట్టి ఎన్నిక కాగల సంఖ్యలోనే అభ్యర్థులను ప్రకటించాయి. విధానసభ నుంచి ఎన్నుకొనే స్థానాలకు మాత్రమే ఈనెల 29న ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగియనుంది.
బీజేపీ 4, కాంగ్రెస్ 2, జేడీఎస్ 1:
విధానసభ సంఖ్యా బలం 117 కలిగిన బీజేపీ నలుగురిని బరిలో దింపింది. కాంగ్రెస్ బలం 68 స్థానాల మేరకు ఇద్దరిని, 34 స్థానాలున్న జేడీఎస్ ఒక అభ్యర్థిని ప్రకటించింది.
కాంగ్రెస్
ఆ ఏడుగురు వీరే:
ప్రధాన విపక్షం కాంగ్రెస్ అందరి కంటే ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించింది. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు బి కె హరిప్రసాద్, సిట్టింగ్ ఎమ్మెల్సీ నసీర్ అహ్మద్ లను బుధవారమే పార్టీ అధిష్టానం ధృవీకరించింది. గురువారం బీజేపీ నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. వీరిలో బెళగావి జిల్లాకు చెందిన సునీల్ వల్యాపుర, రాజీనామాలతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన ఎంటీబీ నాగరాజు, స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్ శంకర్, దక్షిణ కన్నడ బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ సింహ నాయక్ లు తుది అభ్యర్థులుగా ఖరారయ్యారు. ఇక జేడీఎస్ ఏకైక అభ్యర్థిగా ఇంచర గోవిందరాజును ఆ పార్టీ తీర్మానించింది. ఈ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థిగా యడవనహళ్లి పిసి కృష్ణే గౌడ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరంతా గురువారం నామినేషన్లను సమర్పించారు.