83150693 01ce 4fae a161 ca5a7e81ad67

గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద రూ.50 వేల విలువ గల ప్రజా పనుల నిర్వహణ…!

జనరల్

గ్రామీణ భారత ప్రజల జీవనోపాధి అవకాశాలు మెరుగుపరచడం లక్ష్యంగా జూన్ 20 తేదీన గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ మోదీ
వలస కార్మికులకు సహాయం చేసేందుకు ఉద్యమ రీతిలో 6 రాష్ర్టాలకు చెందిన 116 జిల్లాల్లో 125 రోజుల ప్రత్యేక ప్రచారం
ప్రచారోద్యమంతో దీర్ఘకాల మనుగడ ఉండే మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల పెరుగుదల
గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద రూ.50 వేల విలువ గల ప్రజా పనుల నిర్వహణ

ఇటీవల కాలంలో పట్టణాల నుంచి పెద్ద ఎత్తున స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులు, గ్రామీణ పౌరులకు జీవనోపాధి అవకాశాలు పెంచడం ద్వారా వారిని సాధికారం చేయడం లక్ష్యంగా “గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్”  పేరిట పెద్ద ఎత్తున గ్రామీణ ప్రజా పనుల స్కీమ్ ప్రారంభించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. బీహార్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూన్ 20వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి ఈ అభియాన్ ను ప్రారంభిస్తారు. బీహార్ లోని ఖగారియా జిల్లాకు చెందిన బెల్దార్ గ్రామం, తెలిహార్, బ్లాక్ నుంచి ఈ అభియాన్ ఆవిష్కారం జరుగుతుంది. మరో ఐదు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులు కూడా ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొంటారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూనే 6 రాష్ర్టాలకు చెందిన 116 జిల్లాల్లోని గ్రామీణులు కూడా కామన్ సర్వీస్ కేంద్రాలు, కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా సమావేశంలో పాల్గొంటారు.

125 రోజుల పాటు ఈ ప్రచారం ఉద్యమ స్ఫూర్తితో జరుగుతుంది. రూ.50 వేల కోట్ల వ్యయంతో వలస కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా 25 విభిన్న పనులు ఇందులో భాగంగా చేపడతారు.

బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ర్టాల్లో  25 వేల మందికి పైగా వలస కార్మికులున్న మొత్తం 116 జిల్లాలను ఇందుకు ఎంపిక చేశారు. 27 ఆకాంక్షాపూరిత జిల్లాలు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం వలస కార్మికుల్లో మూడింట రెండు వంతుల మంది ఈ జిల్లాల్లోనే ఉన్నారని అంచనా.

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రోడ్డు రవాణా మరియు రహదారులు, గనులు, మంచినీరు మరియు పారిశుధ్యం, పర్యావరణం, రైల్వే, పెట్రోలియం మరియు సహజవాయువులు, సరికొత్త మరియు పునరుత్పాదక ఇంధనం, సరిహద్దు రోడ్లు, టెలికాం, వ్యవసాయం వంటి 12 విభిన్న మంత్రిత్వ శాఖలు/   ప్రభుత్వ శాఖలు ఈ అభియాన్ సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తాయి.