జమ్ము కాశ్మీర్ లో 11,517 కిలోమీటర్ల పొడవైన 1,858 రోడ్లు, 85 వంతెనల నిర్మాణం పూర్తి
అటవీశాఖనుంచి అనుమతులు రాని కారణంగా, మంజూరైన ప్రాజెక్టుల్లో చాలావరకు పనులు 2019 ఆగస్టు వరకూ మొదలే కాలేదు, అయితే, ఆ తర్వాత పరిపాలనా వ్యవస్థలో మార్పు కారణంగా పెండింగ్ ప్రాజెక్టుల్లో చాలావరకు పరిష్కారం కావడంతో, గత ఏడాది కాలంలో పనులు చేపట్టారు. గత సంవత్సర కాలంలో 1,292 కిలోమీటర్ల పొడవైన 181 రోడ్డు నిర్మాణం పనులు, 11 వంతెనల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. వీటికోసం 715కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పి.ఎం.జి.ఎస్.వై.) కింద చేపట్టిన ఉత్తమైన అభివృద్ధి పనులకు ఉదాహరణలుగా ఈ కింది రెండు ప్రాజెక్టులను పేర్కొంటారు.
టి03నుంచి స్టోక్ వరకూ లింక్ రోడ్డు సామర్థ్యం హెచ్చింపు (పి.ఎం.జి.ఎస్.వై- లేహ్)
పొడవు: 11.70 కిలోమీటర్లు, మంజూరైన మొత్తం: రూ. 1,299.78 లక్షలు.
లేహ్ జిల్లాలోని స్టోక్ గ్రామానికి నిర్మించ తలపెట్టిన రోడ్డు, 11.70 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 2001వ సంవత్సరం లెక్కల ప్రకారం, ఈ రోడ్డువల్ల 1,855మంది జనాభాకు ప్రయోజనం కలుగుతుంది. చోగ్లమ్సర్ హెమిస్ రోడ్డులో 2వ కిలోమీటర్ నుంచి స్టోక్ గ్రామం వరకూ ఈ రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. పి.ఎం.జి.ఎస్.వై.-1, 12వ దశ కింద 2018-19వ సంవత్సరంలో ఈ రహదారి ప్రాజెక్టు మంజూరైంది. ఇదే మార్గంలోని పాత తారు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉండేది. పూర్తిగా ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈ రోడ్డు నిర్మిస్తున్నారు. లేహ్ జిల్లాలో ఇలాంటి రోడ్డు నిర్మించడం ఇదే తొలిసారి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ప్లాస్టిక్ వ్యర్థాలను కరిగించి, తారు పూతతో నిర్మించే ఈ రోడ్డువల్ల ప్లాస్టిక్ వ్యర్థాల బెడద తగ్గడంతోపాటుగా, రోడ్డు కూడా పటిష్టంగా ఉంటుంది. 2019లో మొదలైన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకూ 7 కిలోమీటర్ల మేర పూర్తయింది. మిగిలిన రోడ్డు పని 2020 అక్టోబర్ నాటికి పూర్తవుతుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసే ఈ రహదారితో స్టోక్ గ్రామానికి, సమీపంలోని మార్కెట్ తో అనుసంధానం పెరుగుతుంది. దీనితో గ్రామ సామాజిక ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. స్టోక్ గ్రామంలోని రాజప్రాసాదాన్ని, బౌద్ధ పీఠాన్ని సందర్శించేందుకు వేసవి కాలంలో వేలాదిమంది యాత్రికులు ఆ గ్రామానికి వెళ్తుంటారు. లఢక్ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన స్టోక్ కాంగ్డీ శిఖరాన్ని సందర్శించడానికి కూడా జనం వస్తుంటారు.
సప్లై మోర్ టి.03 నుంచి కైంతాగాళీ వరకూ రోడ్డు అభివృద్ది (పి.ఎం.జి.ఎస్.వై. జమ్ము)
పొడవు: 27.70 కిలోమీటర్లు, మంజూరైన మొత్తం: రూ. 2,389.32 లక్షలు
ఉధంపూర్ జిల్లాలోని సప్లైమోర్ ఉధంపూర్ నుంచి కైంతాగాళీ వరకూ నిర్మిస్తున్నారు 27 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే ఈ రోడ్డువల్ల, 2001వ సంవత్సరపు జనగణన ప్రకారం 1,608మంది జనాభాకు ప్రయోజనం చేకూరుతుంది. పి.ఎం.జి.ఎస్.వై.-1,. 11వదశ కింద 2018-19వ సంవత్సరంలో ఈ రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు మంజూరైంది. 2018 అక్టోబర్ లో పనులకు ఆమోదం లభించింది. పలు రకాల అడ్డంకులు, అనుమతుల్లో జాప్యం కారణంగా కొంతకాలం పని మందకొడిగా సాగింది. ప్రస్తుతం వేగం పుంజుకున్న ఈ ప్రాజెక్టులో 11కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయింది. 2021వ సంవత్సరం మార్చి నాటికి మిగిలిన రోడ్డు పని పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ రోడ్డు అభివృద్ధితో దాబ్రేహ్, క్రిమంచి, మన్సార్, పాథి, కైంతాగాళీ గ్రామాలకు,.. సమీపంలోని మార్కెట్ తో అనుసంధానం ఏర్పడుతుంది. అలాగే, జిల్లా ప్రధాన కేంద్రమైన ఉధంపూర్ తో మెరుగైన అనుసంధానం ఏర్పడుతుంది.
ఇలాంటి రహదారుల నిర్మాణంతో ఆయా గ్రామాల్లో జనవాసాల సామాజిక ఆర్థిక పరిస్థితి తప్పకుండా మెరుగుపడుతుంది. అలాగే, పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు, మార్కెట్లు వంటి ప్రాంతాలతో మరింత మెరుగైన అనుసంధానం ఏర్పడుతుంది. ఈ రహదారులకు సమీపంలో కొన్ని యాత్రాస్థలాలు కూడా ఉన్నాయి. పచ్చని అడవులు, పర్వత శ్రేణులమధ్య ఉన్న పంచారీ, స్టోక్ బౌద్ధ పీఠం వంటి యాత్రాస్థలాలకు వెళ్ళేవారికి ఈ రహదారులు ఎంతో ఉపకరిస్తాయి. శీతాకాలంలో మంచుతో కప్పబడిన పర్వతాలు, ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే దృశ్యాలను వీక్షించేందుకు వచ్చే యాత్రికులకు కూడా ఈ రహదారులు ఉపయుక్తంగా ఉంటాయి. సప్లైమోర్ నుంచి కైంతాగాళీ వరకూ నిర్మించే రహదారి ప్రసిద్ధి గాంచిన యాత్రాస్థలానికి అనుసంధానంగా ప్రతి సంవత్సరం ఉపయోగిస్తుంది. ఈ రోడ్ల నిర్మాణంతో యాత్రికుల రాక గణనీయంగా పెరుగుతుంది. ఎక్కడో మారుమూలకు విసిరేసినట్టుగా ఉన్న ఈ గ్రామీణ ప్రాంతాల జీవన ప్రమాణాలు కూడా గణనీయంగా మెరుగుపడతాయి.