కర్ణాటక కమలంలో కలకలం
*యడియూరప్పకు ఎసరు పెట్టేందుకు ఉత్తర ఎమ్మెల్యేల గూడుపుఠాణి
*కరోనా వేళ కష్టాల సుడిలో అప్ప
బెంగళూరు, మే 30:కర్ణాటకను కరోనా కమ్మేస్తుంటే ముఖ్యమంత్రి యడియూరప్పను అసమ్మతి కుమ్మేస్తోంది. ఏ అసమ్మతిని అడ్డుగా పెట్టుకుని యడియూరప్ప నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారో అదే అసమ్మతి తన కుర్చీని కదిలిస్తుంటే దిక్కులు చూస్తున్నారు. ఉత్తర ఎమ్మెల్యేల్లో 20మంది అనువుగాని సమయంలో అసమ్మతి శిబిరంగా మారటం కర్ణాటక కమలాన్ని ఇరుకున పడేస్తోంది.
ముఖ్యమంత్రి లక్ష్యంతో:
ఈ అసమ్మతి శిబిరం ప్రధాన లక్ష్యం ముఖ్యమంత్రే కావటం ఆసక్తి రేపుతోంది. హుక్కేరి ఎమ్మెల్యే ఉమేష్ కత్తి, విజయపుర ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ముందుండి గత గురువారం అర్ధరాత్రి నిర్వహించిన సమావేశం భాజపాకు కొత్త సవాళ్ళను విసిరింది. భాజపా ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు తగినన్ని నిధులు, ఉమేష్ కత్తికి మంత్రిపదవి, అతని సోదరుడు రమేష్ కత్తికి రాజ్యసభ సీటు, తాము సూచించిన వారికి ఎమ్మెల్సీ పదవులు తదితర డిమాండ్లతో ముఖ్యమంత్రిని ఢీ కొట్టే ప్రయత్నం చేసారు. మొత్తంగా ముఖ్యమంత్రి తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఇటీవల పార్టీలో చేరిన వలస నేతలకే ప్రాధాన్యమిస్తున్నట్లు అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసేందుకు సాహసించారు.
సీఎం కుర్చీకే ఎసరు:
తాజా అసమ్మతి సభ్యుల కోరికలు వేర్వేరుగా ఉన్నా వీరి ఉమ్మడి లక్ష్యం మాత్రం ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు పెట్టేలా ఉంది. అసలే కరోనా నియంత్రణలో విసిగి పోతున్న అప్పుకు అసమ్మతి నేతల గూడుపుఠాణి కష్టాల సుడిగుండంలో నెట్టేలా చేస్తోంది. జాతీయ నేతల్లోనూ ముఖ్యమంత్రిపై సదభిప్రాయం లేదు. అధికసార్లు సీఎం పదవి, వయోభారం, పార్టీ విధేయులకంటే బయటివారికే ప్రాధాన్యం ఇచ్చే యడియూరప్ప తత్వం పార్టీ లో అత్యధికులకు మింగుడు పడని విషయం బహిరంగ సత్యం